బచ్చోడు ప్రీ ప్రైమరీ నియామకాల్లో అక్రమాలు: BRS, న్యూడెమోక్రసీ నిరసన

ఒకే కుటుంబానికి రెండు ఉద్యోగాలు, రెండు ఇందిరమ్మ ఇళ్లు ఇదేనా న్యాయం?
అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి, అనర్హ నియామకాలపై విచారణ జరపాలి: BRS, న్యూడెమోక్రసీ డిమాండ్.
ఖమ్మం వాణి|జూలై 20|సోమవారం:
తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ప్రీ ప్రైమరీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ BRS, CPI(ML) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా BRS గ్రామ అధ్యక్షులు జక్కుల యాదగిరి,CPI(ML) న్యూడెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ… బచ్చోడు గ్రామంలో ప్రీ ప్రైమరీ ఉద్యోగాల నియామకంలో పారదర్శకత, సమానత్వం, సామాజిక న్యాయం పాటించలేదని ఆరోపించారు.
నిజంగా అర్హత కలిగిన నందిపాటి సృజన, రామనబోయిన రజిత లను పక్కనపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని తీవ్రంగా ఖండించారు. రాజకీయ ఒత్తిళ్లతో కాకుండా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే కుటుంబంలో రెండు ఉద్యోగాలు, రెండు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం అన్యాయమని అన్నారు. ప్రజల స్వేచ్ఛను హరించే రాజకీయ బెదిరింపులను ఖండిస్తున్నామని తెలిపారు.
సంబంధిత అధికారులు నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో అన్ని నియామకాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి వార్డు మెంబర్ గుజ్జ రామకృష్ణ అధ్యక్షత వహించారు. అర్హత కలిగిన అభ్యర్థి నందిపాటి సృజన,రామనబోయిన రజిత భావోద్వేగంతో మాట్లాడారు. ఈ నిరసనలో సందు రాజు, వేములపల్లి మల్లికార్జున్, నందిపాటి లక్ష్మీనారాయణ, గొర్రెపాటి లింగయ్య, దారమల్ల కృష్ణ, భగత్ సింగ్, లెనిన్, నందిపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం…
