నిరసన తెలపడం నేరం కాదు: పౌర హక్కులను సమర్థించిన బాంబే హైకోర్టు
రాజకీయ విమర్శలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
జస్టిస్ మాధవ్ జామ్దార్ సంచలన తీర్పు
బొంబాయి, జూలై 03(ఖమ్మం వాణి): ప్రజాస్వామ్యంలో పౌరులకు గల ప్రాథమిక హక్కులను,నిరసన తెలిపే స్వేచ్ఛను బాంబే హైకోర్టు మరోసారి శక్తివంతంగా సమర్థించింది.ముంబైలో రాజకీయ నినాదాలు చేసినందుకు ఒక సామాన్యుడిపై నమోదైన కేసులను,మరియు అతడిని బహిష్కరిస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ మాధవ్ జామ్దార్ కొట్టివేస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపాయి.ప్రభుత్వంపై లేదా రాజకీయ నాయకులపై విమర్శలు చేసినంత మాత్రాన పౌరులను అణచివేయడం, వారిపై కేసులు బనాయించడం అప్రజాస్వామికమని కోర్టు స్పష్టం చేసింది.ముఖ్యంగా, నిరసనను అణచివేయడం అధికార సాధన కాదని, పాలకులను ప్రశ్నించడం పౌరుడి బాధ్యత అని న్యాయమూర్తి ఉద్ఘాటించారు.పౌరులందరినీ మీరు ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? నినాదం చేస్తే కేసులు పెడతారా?” అని పోలీసులను నిలదీస్తూనే, ప్రస్తుత వ్యవస్థలో నెలకొన్న వైరుధ్యాలను ఆయన ఎండగట్టారు. నీట్ పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు వంటి తీవ్రమైన సమస్యలు కళ్లముందే జరుగుతుంటే వాటిని పరిష్కరించాల్సిన యంత్రాంగం, పౌరుల నోరు నొక్కేందుకు ప్రయత్నించడం దేనికి నిదర్శనమని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల గొంతును నొక్కడం ద్వారా సమాజాన్ని భయాందోళనలకు గురి చేయడం సరికాదని,నిరసన తెలపడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని హైకోర్టు తేల్చిచెప్పింది.ప్రభుత్వాల పనితీరుపై పౌరులు తమ అసమ్మతిని వ్యక్తం చేసే హక్కును చట్టం కాపాడుతుందని ఈ తీర్పు మరోసారి గుర్తుచేసింది. అధికార యంత్రాంగం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని,నిరసనను శత్రువుగా చూడటం మానుకోవాలని ఈ తీర్పు ద్వారా హైకోర్టు స్పష్టమైన సంకేతాలను పంపింది.
