తిరుమలాయపాలెం మండలంలో కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటన
గ్రామాల్లో పూజలు, గ్రామసభల్లో ప్రజా సమస్యలపై చర్చించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే
తిరుమలాయపాలెం, జూలై 10(ఖమ్మం వాణి): మండలంలోని పలు గ్రామాల్లో పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. మేకల తండా, కుక్కల తండా, చంద్రు తండా, మహమదాపురం, బోడ తండా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
గ్రామాల్లోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు.
గ్రామ పెద్దలు, మహిళలు పూలమాలలతో ఆప్యాయంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో ఆయన పాల్గొని ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
గ్రామస్తులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, ఓపికగా విన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, రేషన్ తదితర సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ,
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువగా ఉండి, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమాల్లో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాషబోయిన వీరన్నతో పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, యువకులు, వృద్ధులు కూడా అధిక సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన పర్యటనతో మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని కార్యకర్తలు తెలిపారు.

