స్థానిక మహిళలకు భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ.
ఇంటర్ పాసైతే నేరుగా సర్కార్ కొలువు
భద్రాద్రి,కొత్తగూడెం | జూలై 08|ఖమ్మం వాణి : తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగుల, వమోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 178 అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనుంది.అశ్వారావుపేట,బూర్గంపాడు,పచంద్రుగొండ,చర్ల, దమ్మపేట, దుమ్ముగూడెం,కొత్తగూడెం,మణుగూరు,పాల్వంచ, టేకులపల్లి,ఇల్లెందు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో మొత్తం 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగూడెం జిల్లా పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇప్పటికే 6 జిల్లాల్లో నోటిఫికేషన్ల విడుదల పూర్తయింది.
• జిల్లాలో ప్రాజెక్టుల వారీగా పోస్టుల వివరాలు
| ప్రాజెక్టు | పోస్టులు | అర్హత |
| అశ్వారావుపేట | 11 | ఇంటర్ పాస్ |
| బూర్గంపాడు | 10 | ఇంటర్ పాస్ |
| చంద్రుగొండ | 8 | ఇంటర్ పాస్ |
| చర్ల | 12 | ఇంటర్ పాస్ |
| దమ్మపేట | 16 | ఇంటర్ పాస్ |
| దుమ్మగూడెం | 12 | ఇంటర్ పాస్ |
| కొత్తగూడెం | 16 | ఇంటర్ పాస్ |
| మణుగూరు | 24 | ఇంటర్ పాస్ |
| పాల్వంచ | 29 | ఇంటర్ పాస్ |
| టేకులపల్లి | 19 | ఇంటర్ పాస్ |
| ఇల్లెందు | 21 | ఇంటర్ పాస్ |
| మొత్తం | 178 |
• అంగన్వాడీ హెల్పర్, టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత వార్డులోనూ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలోనూ నివసిస్తూ ఉండాలి. గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు అర్హులుగా పరిగణిస్తారు. https://mis.tgwdcw.in/Recruit_Inter.aspx
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జులై 18, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)లో ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది. ఎంపికలో మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది.ఇంటర్వ్యూలకు పది మార్కులు కేటాయిస్తారు. ఎంపికైన వారికి జులై 20 నుంచి ఆగస్టు 7 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
• ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్లు
పుట్టిన తేదీ/వయసు ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
ఇంటర్ మార్కుల జాబితా
నివాస ధ్రువీకరణ పత్రం
అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికేట్
వితంతువు అయితే భర్త డెత్ సర్టిఫికెట్
ఆనధ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.
