ఆంధ్రప్రదేశ్, జూన్ 18 (ఖమ్మం వాణి ప్రతినిధి):
ప్రజారోగ్యం కోసం ‘సంజీవని’ కార్యక్రమంతో యోగాను అనుసంధానం చేసి ప్రతి ఇంటికీ చేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమంపై బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం, ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
ముఖ్యాంశాలు:
- రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో యోగా డేకు ఏర్పాట్లు
- యోగా డే కోసం కోటికి పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి
- 20, 21వ తేదీల్లో యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి సీఎం పాల్గొననున్నారు
- ఇప్పటివరకు 2.6 లక్షల మందిని యోగా ట్రైనర్లుగా తీర్చిదిద్దారు
సీఎం కీలక ఆదేశాలు:
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం నిర్దేశించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన యోగా మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రత్యేక పురస్కారాలు అందజేయాలని సూచించారు. ‘ఇంటింటికీ యోగా’ ప్రధాన థీమ్‌గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. వివిధ వైద్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక ‘థెరప్యూటిక్ యోగా’ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పారు.
సీఎం షెడ్యూల్:
ఈనెల 20న ఉండవల్లి గుహల వద్ద బాబా రాందేవ్‌తో కలిసి యోగా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 21వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం జరుగుతుంది. స్టేడియంలో 5 వేల నుంచి 6 వేల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా అవాంతరం ఏర్పడితే, ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో కార్యక్రమం నిర్వహిస్తారు.బాబా రాందేవ్ 19వ తేదీన రాష్ట్రానికి చేరుకొని ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. 18 నుంచి 20 వరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు జరుగుతాయి. 21వ తేదీన ‘యోగా డెస్టినేషన్’ పేరుతో వచ్చే ఏడాది యోగా డే వరకు కేలండర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
