ఓటర్ల జాబితాపరిశీలనలో నిర్లక్ష్యంవద్దు.
ప్రతిపోలింగ్ బూత్‌కు ఒకరిని నియమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం!
ఖమ్మం/పాలేరు: జూన్ 17(ఖమ్మం వాణి) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.గతంలో బెంగాల్, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా పరిశీలనను పట్టించుకోకపోవడం వల్లే అక్కడి పార్టీలు నష్టపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. మనం ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రస్తావిస్తూ, ఇప్పుడు 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియ చేపడతారని వివరించారు. ఇందులో లింక్ ఓట్లు, లింక్ లేని ఓట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 36 వేల పోలింగ్ బూత్‌లు, మూడు కోట్ల 39 లక్షల ఓట్లు ఉన్నాయని, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 291 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. అందుకే ప్రతి పోలింగ్ బూత్‌కు ఒకరిని తప్పనిసరిగా నియమించాలని ఆదేశించారు. బీఎల్ఏ (BLA), బీఎల్ఓ (BLO)ల పరిశీలన అనంతరం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలవుతుందని వెల్లడించారు. చనిపోయిన వారి ఓట్లు జాబితాలో ఉంటే వెంటనే తొలగించాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా గల్లంతు కాకూడదని సూచించారు. రాబోయే ఎన్నికలకు ఇదే తుది ఓటర్ల జాబితా కానుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎన్నికలు నిజాయితీగా జరిగితే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ వంద సీట్లతో ఘన విజయం సాధించి తీరుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
