అరుణోదయ కళాకారుడు భూక్య వెంకన్న మృతి – సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కు తీరని లోటు
ఖమ్మం/తిరుమలాయపాలెం, జూన్ 20(ఖమ్మం వాణి):
సారా వ్యతిరేక, రైతాంగ ఉద్యమాల్లో కళారూపాలతో ప్రజల్ని చైతన్యపరిచిన అరుణోదయ కళాకారుడు భూక్య వెంకన్న మరణం. మాస్ లైన్ పార్టీకి తీరని లోటు అని నాయకులు సంతాపం.
అరుణోదయ కళాకారుడు, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) తిరుమలాయపాలెం మండలం బిసరాజుపల్లి గ్రామ నాయకుడు భూక్య వెంకన్న కొద్దిసేపటి క్రితం మరణించారు. సంకకు డప్పు, కాళ్లకు గజ్జెలు కట్టి సారా వ్యతిరేక ఉద్యమాల్లో, రైతాంగ ఉద్యమాల్లో, కూలీల హక్కుల కోసం, దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన కళారూపాలతో ప్రజల్ని చైతన్యపరిచిన గొప్ప కళాకారుడు వెంకన్న. మరణ వార్త తెలిసిన వెంటనే మాస్ లైన్ ప్రతినిధి బృందం భౌతికకాయానికి ఎర్రజెండా కప్పి, రెండు నిమిషాలు మౌనం పాటించి కుటుంబానికి సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకులు కమ్మకోమటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, “వెంకన్న మరణించే వరకు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, నమ్మిన ఎర్రజెండా కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాడారు. ఆయన మరణం అరుణోదయ సంస్థకు, మాస్ లైన్ పార్టీకి తీరని లోటు. వెంకన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు, మాస్ లైన్ డివిజన్ నాయకులు ఎడ్లపల్లి నవీన్, అరుణోదయ రాష్ట్ర నాయకులు ఆరంపల వెంకన్న, బానోతు శంకర్, పి.వై.ఎల్ మండల కార్యదర్శి పరికపల్లి మధు, కత్తుల మల్లయ్య, బోడ రమ్య, నోనావత్ తావూరియా, బానోతు సురేష్, సర్పంచ్ మాలోత్ బద్రు, బండారు నాగయ్య, తాళ్లపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
