బోడతండలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా సంపన్నం
సర్పంచుల దంపతుల ఆధ్వర్యంలో ముగింపు పూజలు.. భక్తుల జయజయధ్వానాలు
తిరుమలాయపాలెం,జూన్ 26(ఖమ్మం వాణి): మండల పరిధిలో మహ్మదాపురం గ్రామపంచాయతీ బోడతండ గ్రామంలో గత ఐదు రోజులుగా వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగిన శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయస్వామి, వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర, దీపస్తంభ, శివలింగ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ముగింపు రోజైన శుక్రవారం ఉదయం మహ్మదాపురం సర్పంచి బోడ మంజు – రవి దంపతులు, ఇస్లావత్ తండా సర్పంచి ఇస్లావత్ సునీత – రవి దంపతులు, గ్రామ పెద్దలు, భక్తబృందం ఆధ్వర్యంలో దీపస్తంభం, నూతన శివలింగం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేదమూర్తులు యమనంద్ర భానుప్రకాశ్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి, వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాల వితరణతో కార్యక్రమం పరిసమాప్తమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, వందలాది గ్రామస్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
గత 4 రోజుల విశేషాలు: జూన్ 21న గణపతిపూజ, పుణ్యాహవాచనంతో మొదలైన ఉత్సవాలు, 23న గ్రామతోరణ బంధనం, అఖండ దీపస్థాపన, నవగ్రహ హోమం, వాస్తుహోమంతో కొనసాగాయి. 24న అధివాస హోమం, రుద్రాభిషేకం, గ్రామ అష్టదిగ్బంధనం, సాయంత్రం స్వామివార్ల గ్రామోత్సవంతో భక్తులను అలరించాయి. 25న ఉదయం 10.44 ని.లకు స్వాతి నక్షత్రయుక్త సింహలగ్నంలో విగ్రహ ప్రతిష్ఠ, జీవకళలు, నేత్రదర్శనం వైభవంగా జరిగాయి. ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ ప్రతిష్ఠా మహోత్సవాలతో బోడతండ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గ్రామ కమిటీ, యువకులు, మహిళల సమిష్టి కృషితో ఉత్సవాలు విజయవంతం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అన్నదానంతో కార్యక్రమాలు ముగిశాయి.
