రఘునాథపాలెంలో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం
తిరుమలాయపాలెం, జూన్ 24 (ఖమ్మం వాణి):
తిరుమలాయపాలెం మండలం రఘునాథపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. తిరుమలాయపాలెం ప్రాజెక్టు పరిధిలోని సుబ్లేడు సెక్టార్కు చెందిన ఈ నూతన భవనాన్ని గ్రామ సర్పంచి చంద్రయ్య, సీడీపీఓ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా సీడీపీఓ కవిత మాట్లాడుతూ, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో నూతన భవనాలు నిర్మిస్తోందని తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గ్రామ సర్పంచి చంద్రయ్య మాట్లాడుతూ, నూతన భవనం ద్వారా కేంద్రానికి వచ్చే చిన్నారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు రేణుక, పరంజ్యోతి, బుచ్చమ్మ, పద్మ, హెల్పర్ బూబ, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
