హస్నాబాద్లో పల్స్ పోలియోకు సర్పంచ్ శ్రీకారం
5 ఏళ్లలోపు ప్రతి బిడ్డకు చుక్కలు తప్పనిసరి – కొవ్వూరు పద్మా సత్తిరెడ్డి
తిరుమలాయపాలెం, జూన్ 28(ఖమ్మం వాణి):మండలం హస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ కొవ్వూరు పద్మా సత్తిరెడ్డి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తు చేశారు. పోలియో మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టాలంటే ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చుక్కలు వేయాలని కోరారు. గ్రామాన్ని పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేశారు. వలస కూలీలు, ఇటుక బట్టీల వద్ద పనిచేసే కుటుంబాల పిల్లలకు కూడా చుక్కలు అందేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈ మూడు రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక పోలియో కేంద్రాలు పనిచేస్తాయని, ఎవరైనా మిగిలిపోతే వెంటనే ఆశా కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, చిన్నారుల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
