పాలేరులో 3.50 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
రహదారి,పంచాయతీ కార్యాలయాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, జూన్ 28(ఖమ్మం వాణి): అభివృద్ధి, సంక్షేమం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో 3 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అప్పలనర్సింహాపురం నుండి గండ్రాయి వరకు 3 కోట్ల 10 లక్షల రూపాయలతో తారు రహదారి నిర్మాణ పనులకు, 20 లక్షల రూపాయలతో కొరట్లగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాజారాంపేటలో 20 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు, మౌలిక వసతులు కల్పించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల అభ్యున్నతే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నేరుగా పేద ప్రజలకు చేరేలా పారదర్శకంగా అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు 63 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మహిళల స్వయం ఉపాధి కోసం పెట్రోలు కొట్టాల కేటాయింపుతో పాటు, నేలకొండపల్లి మండలంలోని మహిళా సంఘాలకు త్వరలోనే ఒక బియ్యం మర మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో తొలిసారిగా డ్వాక్రా మహిళలకు బియ్యం మర అందించిన ప్రభుత్వం ఇదేనని, భవిష్యత్తులో అన్ని మండలాల్లో మహిళా సంఘాలకు బియ్యం మరలు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, నాణ్యమైన సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహాలు అందిస్తున్నామని చెప్పారు. మొదటి విడత ఇళ్లు మంజూరు చేశామని, రెండో విడత కొనసాగుతోందని, మూడు, నాలుగో విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ దశకు అనుగుణంగా ప్రతి సోమవారం నిధులు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసంతో ఏర్పడిన ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళల సాధికారత, రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని, గ్రామీణాభివృద్ధే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పునాది అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం శాసనసభ్యులు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, అదనపు జిల్లా పాలనాధికారి పి. శ్రీనివాస రెడ్డి, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక అభియంత వెంకట్ రెడ్డి, ఖమ్మం ఉప పాలనాధికారి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
