చికాకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ… ఇక పాడదు
రాజారాం గడ్డపై పుట్టి తెలంగాణ గుండెను తాకిన విప్లవ స్వరం మూగబోయింది
‘పీడితుల పిల్లనగ్రోవి’ కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు ఖమ్మంవాణి అశ్రునివాళి
ఖమ్మం వాణి డెస్క్ | ఖమ్మం, జులై 03: చికాకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ… ఈ పాట విన్న ఖమ్మం గడ్డ ఉలిక్కిపడేది. ఆ పాట పాడిన గొంతు ఇక లేదు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని గొంతులో నింపుకొని ఊరూరా తిరిగిన ప్రజా యుద్ధ నౌక, విప్లవ గాయకుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామంలో పుట్టిన నాగన్న, గత కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్నారు. రాజారాం నుంచి రణరంగం దాకా సాగిన ఆయన జీవితం ఒక ఉద్యమం. ఒక చరిత్ర.
1975: చీకటి కాలంలో వెలిగిన గొంతు
ఎమర్జెన్సీ. దేశమంతా చీకటి. అదే సమయంలో నాగన్న అరుణోదయ సాంస్కృతిక సంస్థ ద్వారా గొంతు విప్పాడు. ఆయన పాట లాలిగా, జోలగా మొదలైంది. కానీ అక్కడే ఆగలేదు. పోరుగా, నక్సల్బరీ హోరుగా, గోదావరి లోయగా, అడవి మల్లెగా, వేకువజాము పల్లెగా, అరుణోదయ బాటగా మారింది. అన్నామరుడురా మన రామనరసయ్య అని ఆయన పాడితే యావత్ తెలంగాణ ఏకమైంది. ఆ పాట వినని చెవి లేదు, తాళం వేయని గుండె లేదు. కొమ్మల్లో రెమ్మల్లో కమ్మంగా పాడేటి నల్లాని ఓ కోయిలమ్మ అంటూ పాడితే, కళ్ళలో నీళ్ళు తిరగని మనిషి లేడు.
ఆయన పాట అంటే కేవలం సంగీతం కాదు… ఒక యుద్ధం
ఎమర్జెన్సీలో జైలు గోడల మధ్య ఉన్నా ఆయన గొంతు ఆగలేదు. ఎందుకంటే నాగన్నకు గొంతు ఒక ఆభరణం కాదు, ఆయుధం. చేనులో రైతుతో, కర్మాగారంలో కార్మికుడితో కలిసి నడిచిన జనం కళాకారుడు నాగన్న. పీడిత ప్రజల విముక్తి ఆయన స్వప్నం. రాజకీయ విశ్వాసం, నిర్మాణ నిబద్ధత, విప్లవ ఆరాటం ఆయన వ్యక్తిత్వం.
ఒక గాయకుడు ఎందుకు పాడతాడు?
పాటలు ఎన్నో. ఒక గాయకుడు తన కోసం ఎన్నిసార్లు పాడుకుంటాడు? తన కోసం కొన్ని, జనం కోసం కొన్ని పాడుకుంటాడా? నాగన్న మాత్రం తన కోసం ఎప్పుడూ పాడలేదు. ఆయన గొంతు పూర్తిగా జనానిది. పీడితులది. అందుకే ఆయన గొంతును ‘పీడితుల పిల్లనగ్రోవి’ అని పిలిచారు. పాట పెరిగి పెద్దదై జీవించేది గాయకుడి గొంతులోనే. పసితనాన్ని, బాల్యాన్ని, యవ్వనాన్ని, మరణాన్ని, ఆపై అమరత్వాన్ని పలికించేది ఆ గొంతు తడితోనే. నాగన్న గొంతు అలాంటిది.
గొంతులో ఒక దృశ్యం
నాగన్న పాడితే పక్షిలా, పక్షుల గుంపుల్ని మోస్తున్న మహా వృక్షంలా కనిపించేవాడు. ఒంటరిగా, తుంటరిగా, ముసి ముసిగా, మసి మసిగా, కన్నీళ్ళలా, కాలిపోతున్నట్టు, గాలి ఆగిపోతున్నట్టు ఉండేవాడు. దగ్గరగా వచ్చి, కళ్ళ మీదికొచ్చి, మసకబార్చి రెప్పపాటులో దూరమయ్యేవాడు. మనసులో భావోద్వేగాలని తాకి కొత్త సముద్రాల్ని సృష్టించేవాడు. నాగన్న గాన కెరటం. నాజార్లా, కానూరి తాతలా, అరుణోదయ రామారావులా మన మనసులో కూర్చొని గుండెల్ని కెలుకుతుంటాడు. ఆయన గొంతు పాటల ప్రవాహం. ఆ ప్రవాహం అడవిలా చిక్కగా, అమరత్వంలా రమణీయంగా ఉండేది.
విప్లవ స్వర జ్వలనం ఆగిపోయింది
ఇప్పుడు ఆ సప్త స్వరాల కెరటం ఆగిపోయింది. కానీ ఆయన వెలిగించిన చైతన్య జ్యోతి ఆరదు. ఖమ్మం గడ్డ మీద పుట్టిన ఆ విప్లవ సూర్యుడు, రాజారాం ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రజా గాయకుడు ఇక లేడు. కానీ ఆయన పాట చిరంజీవి. రాజారాంలో పుట్టిన ఆ బిడ్డ, తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు.
జోహార్ కామ్రేడ్ నాగన్న… మీ పాట అమర్ హై 🕯️
– ఖమ్మంవాణి డెస్క్
