ప్రజల కష్టసుఖాల్లో భాగమైన కందాళ ఉపేందర్ రెడ్డి.
ఆలయ ఉత్సవం నుంచి పరామర్శల వరకు.. ఖమ్మం రూరల్, కూసుమంచిలో మాజీ శాసనసభ్యుని పర్యటన
ఖమ్మం: పాలేరు మాజీ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి భరోసా కల్పించారు.
⇒ ఏదులాపురం ఆలయ ఉత్సవంలో దంపతుల పూజలు
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో కోదండ రామచంద్ర స్వామి దేవాలయ చతుర్థ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఉపేందర్ రెడ్డి సతీమణి విజయతో కలిసి ఉత్సవంలో పాల్గొన్నారు. దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉపేందర్ రెడ్డి, విజయ దంపతులను శాలువాతో సత్కరించారు.
⇒ అనారోగ్య బాధితులకు భరోసా
పడమటి తండ గ్రామానికి చెందిన దారేడు మాజీ మత్స్య సహకార సంఘం ఛైర్మన్ బానోత్ కిషన్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న ఉపేందర్ రెడ్డి కిషన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పొన్నేకల్ గ్రామంలోనూ అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు.
⇒ మృతుల కుటుంబాలకు ఓదార్పు
ఖమ్మం రూరల్ మండలంలోని కైకొండాయిగూడెంలో ఇటీవల మరణించిన లింగనబోయిన ముత్తయ్య, మంచాల తులసమ్మ, ఆంగోత్ బద్రు, తేజవత్ సక్రు కుటుంబాలను ఉపేందర్ రెడ్డి పరామర్శించారు. గుర్రాలపాడు గ్రామంలో ప్రమాదంలో మరణించిన బొబ్బల లింగరాజు కుమారులు వేదిక్ కుమార్, తనిష్క్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. పొన్నేకల్, తల్లంపాడు గ్రామాల్లో మరణించిన పెనుగొండ రుక్మిణి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూసుమంచి మండలం గైగోళ్లపల్లిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుమ్మరికుంట్ల పుల్లయ్య కుటుంబాన్ని, చౌటపల్లిలో మరణించిన నందిపాటి భద్రయ్య కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
⇒ శుభకార్యాల్లో పాల్గొని ఆశీర్వచనం
తల్లంపాడు గ్రామంలో బొడ్డు వెంకటేశ్వర్లు, నాగమణి కుమార్తె శ్రీలత వివాహ పూర్వ వేడుకకు హాజరై వధువును ఆశీర్వదించారు. అదే గ్రామంలో నూతనంగా వివాహమైన కొమ్ము చరణ్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపేందర్ రెడ్డి వెంట బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఖమ్మం ఈవినింగ్ డెస్క్
