బీటీ–3 పత్తి సాగుకు దూరంగా ఉండాలి: రైతులకు వ్యవసాయ శాఖ సూచన
తిరుమలాయపాలెం,జూలై 06 (ఖమ్మం వాణి): మండలం పరిదిలోని తేట్టెలపాడు, దమ్మాయిగూడెం గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారామరెడ్డి సర్పంచుల సమక్షంలో పత్తి సాగు చేస్తున్న రైతులతో సమావేశమై బీటీ–3 పత్తి సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, బీటీ–3 పత్తి సాగు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. ఇంకా పత్తి విత్తని రైతులు అధిక సాంద్రత పద్ధతి హెచ్. డి. పి.ఎస్ లో సాగు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ద్వారా 100 శాతం సబ్సిడీపై పత్తి విత్తనాలను రేపటిలోగా పొందవచ్చని వివరించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు లేదా నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 పత్తి విత్తనాలను సాగు చేసినా, నిషేధిత విత్తనాలు, పురుగుమందులు లేదా ఎరువులను వినియోగించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీటీ–3 పత్తి సాగు వల్ల కలిగే నష్టాలు, చ ట్టపరమైన పరిణామాలపై రైతులకు వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఆసియా, ప్రదీప్తో పాటు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
