సమ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కల్లేపల్లి ప్రశాంత్ నియామకం !
సమ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బొల్గూరి కిరణ్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రం !
హైదరాబాద్| జూలై 07|ఖమ్మం వాణి: తెలంగాణ రాష్ట్రంలో 2034 సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ పంధాతో సమాజ్ పార్టీ ముందుకు సాగుతోంది. మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పెరియర్ ఈ.వి. రామస్వామి ల ఆలోచనల స్ఫూర్తితో సమానత్వ వాద సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పార్టీ అధ్యక్షులు బొల్గూరి కిరణ్ కుమార్ తెలిపారు. సమాజంలో నూటికి 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. కులాల ప్రాతిపదికన, జనాభా ప్రాతిపదికన హక్కుల్లో వాటా ఉండాలనే “మేమెంతో – మాకంత” నినాదంతో ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాలకు బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించగా, తాజాగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా ప్రముఖ అడ్వకేట్ కల్లేపల్లి ప్రశాంత్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కల్లేపల్లి ప్రశాంత్ గత కొంతకాలంగా సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. న్యాయవాద వృత్తిలో ఉంటూనే బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాడుతున్నారు. ఆయన అనుభవం, నిబద్ధత పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని బొల్గూరి కిరణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియామకం 06-07-2026 తేదీ నుండి అమల్లోకి వస్తుంది. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కల్లేపల్లి ప్రశాంత్ జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. పార్టీ విస్తరణతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని, పార్టీ సిద్ధాంతాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి 2034 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. సమ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో సిద్దిపేట జిల్లాలో పలు కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించనుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తామని నూతన జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి ప్రశాంత్ తెలిపారు.
