విద్యార్థుల బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన: పి.డి.ఎస్.యు హెచ్చరిక !
ఖమ్మం | జూలై 07| ఖమ్మం వాణి: విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ మరియు ఫీజు రాయితీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా కమిటీ నేతృత్వంలో కాకతీయ విశ్వవిద్యాలయ అనుబంధ పీజీ కేంద్రం మరియు బీపిడి డిగ్రీ కళాశాల వద్ద నిరసన ప్రదర్శన చేసి ప్రభుత్వ తీరుకు నిరసనగా దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చే ముందు విద్యకు పెద్దపీట వేస్తామని, ఫీజు రాయితీని మరింత మెరుగుపరుస్తామని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ హామీలను విస్మరించారని విమర్శించారు.
రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడుతున్నారని, దాదాపు 11 వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు అందకుండా ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా బడ్జెట్ ను 15 శాతానికి పెంచుతామన్న మాట నిలబెట్టుకోలేదని, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధికారి పోస్టులను భర్తీ చేయడం లేదని తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరని, ఒకే అనుమతితో పలు కోర్సులు నడుపుతున్నా చర్యలు లేవని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. పెండింగ్ నిధులు వెంటనే చెల్లించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ముఖ్యమంత్రి ఖమ్మం పర్యటనకు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసనలో సంఘ నాయకులు గాంధీ, శ్రీకాంత్, నరసింహ తో పాటు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు.
