ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరగాలి: కలెక్టర్ దివాకర టిఎస్
తిరుమలాయపాలెం, జూన్ 19 (ఖమ్మం వాణి)
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా, సమయపాలనతో పనిచేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు.
శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన కలెక్టర్, తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్, ఓపి, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, ప్రసూతి వార్డులను పరిశీలించి అక్కడి వైద్య సదుపాయాలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరును చెక్ చేశారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు.
- సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి:
తిరుమలాయపాలెం ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఆశా కార్యకర్తలతో సమన్వయం చేసుకుని గర్భిణీలను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను పూర్తిగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, చికిత్సలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని సూచించారు.
100 పడకల హాస్పిటల్ పనులు వేగవంతం:
అనంతరం రూ.26 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో వాడుతున్న కాంక్రీట్, సిమెంట్, ఐరన్ నాణ్యతను తనిఖీ చేశారు. ప్రాధాన్యత పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్ణీత గడువులోపు ఆసుపత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.”గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. నూతన ఆసుపత్రి అందుబాటులోకి వస్తే స్థానికులకు మరింత నాణ్యమైన చికిత్స లభిస్తుంది. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దు” అని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.ఈ తనిఖీల్లో డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డా. కృప ఉషశ్రీ, ఇఇ ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్, డాక్టర్ సురేష్, డాక్టర్ బుల్లి కొండ శ్రీనివాసరావు, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ వైదేహి, డాక్టర్ ప్రసన్న జ్యోతి, డాక్టర్ బాలు, డాక్టర్ చంద్రశేఖర్, గ్రేడ్-2 లక్ష్మితో పాటు పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఖమ్మం వాణి మరిన్ని వార్తలు కోసం..
