ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
“పీడిత వర్గాల గొంతుకను కోల్పోయాం” – కందాళ ఉపేందర్ రెడ్డి
తిరుమలాయాపాలెం, జూలై 05( ఖమ్మం వాణి): ఖమ్మం జిల్లా తిరుమలయాపాలెం మండలం రాజారం గ్రామానికి చెందిన ప్రముఖ ప్రజా గాయకుడు, విప్లవ కళాకారుడు అరుణోదయ నాగన్న ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు నాయకులు, కళాకారులు సంతాపం తెలిపారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నాగన్న ఖమ్మంలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాగన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషమ పరిస్థితిలో వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ…”అరుణోదయ నాగన్న అంటే కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు. ఆయన పీడిత, తాడిత, బడుగు బలహీన వర్గాల గొంతుక. తన పాటల ద్వారా సమాజంలోని అసమానతలను ఎండగట్టారు. చివరి శ్వాస వరకు విప్లవ భావజాలంతో ప్రజల్లో చైతన్యం నింపారు. అలాంటి గొప్ప కళాకారుడిని, ఒక ఉద్యమకారుడిని మనం కోల్పోవడం ఖమ్మం జిల్లాకు, మొత్తం తెలంగాణకు తీరని లోటు” అని అన్నారు. నాగన్న సేవలను ప్రభుత్వం గుర్తించి, ఆయన కుటుంబానికి తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా నాగన్న పేరుతో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపియం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్,బిఆర్ఎస్ రూరల్ మండల అద్యక్షుడు బెల్లం వేణు, బిఆర్ఎస్ మండల నాయకులు కొప్పులు ఉపేందర్ రెడ్డి, రంగాపురం బాలకృష్ణ గౌడ్ మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, కళాకారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
