మధిరలో వేగంగా అభివృద్ధి పనులు: కలెక్టర్ దివాకర క్షేత్ర పరిశీలన
మధిర | జూలై 07(ఖమ్మం వాణి): మధిర పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఈ పర్యటనలో భాగంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం, మహాప్రస్థానం ప్రాంత అభివృద్ధి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భ విద్యుత్ తీగల పనులను కలెక్టర్ కూలంకషంగా తనిఖీ చేశారు. ప్రతి పని ఎంతవరకు వచ్చిందో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో చేస్తున్న ఈ పనులు ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడాలని చెప్పారు. నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. పనులను నిర్ణీత సమయంలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ చైర్మన్ సామినేని సుజాత, మున్సిపల్ కమిషనర్ సామ్యూల్ బెనటిక్ ఇజ్రాయిల్ పాల్, ఉపాధ్యక్షుడు కోనాధని కుమార్, మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మిర్యాల వెంకటరమణ గుప్తా, రంగా శ్రీనివాసరావు, తన్నీరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
