ఖమ్మం వాణి, నేలకొండపల్లి, జూన్ 16 : నాణ్యమైన ఎరువులు విత్తనాలు రైతులకు సబ్సిడీపై అందించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా డిమాండ్ చేసింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరింది. మంగళవారం రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని నేలకొండపల్లి తహసీల్దార్ ఎం రాంప్రసాద్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య, ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు స్వామినాథన్ సిఫార్సు సీ2 ప్లస్ 50 ప్రాతిపదికన మద్దతు ధర ఇచ్చి రైతులను 2022 కల్లా ధనిక రైతులను చేస్తానని చెప్పిన మాటలు పచ్చి మోసమని తేలిపోయిందని అన్నారు. రైతులను ముంచే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి 750 మంది రైతులను బలి తీసుకుందని ఆరోపించారు. కార్పొరేట్ అనుకూల విధానాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని విమర్శించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా తగ్గించి వాటి ధరను విపరీతంగా పెంచిందన్నారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్రం నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత యుద్ధం పేరు చెప్పి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులు లక్షలాదిగా ఉన్నారని వారి రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరారు. పండిన పంటలు నెలలకొద్దీ మార్కెట్లో కాపలా ఉండాల్సిన పరిస్థితి రైతులకు వచ్చిందని వెంకయ్య, హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నేలకొండపల్లి మండల కార్యదర్శి చిర్రా భిక్షం, పగిడి కత్తులు వెంకటేశ్వర్లు, దామల రామదాసు, ఎల్లమ్మ, సుగుణ పాల్గొన్నారు.
