తిరుమలాయపాలెం, జూన్ 17(ఖమ్మం వాణి) ఉపాధి హామీ కూలీలకు రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఏఐపీకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షులు రెంటాల యాదగిరి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండెల వెంకయ్య, కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. భూమిలేని కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల జీవన భృతితో పాటు రైతు భరోసా ఇవ్వాలని కోరారు. ఉపాధి పని స్థలాల్లో తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు, వైద్య సౌకర్యాలు కల్పించాలని, ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి, కూలీలకు ఆత్మీయ భరోసా అందించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉపాధి కూలీలకు కూడా పని కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి వరి నాట్లు, కోతలు, కలుపు తీత వంటి వ్యవసాయ పనులకు అమలు చేయాలని సూచించారు. ఫోటో మానిటరింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. జి.రామ్.జి పథకాన్ని కార్పొరేట్ సంస్థల కోసమే తీసుకొచ్చారని, వెంటనే ఆ పథకాన్ని తొలగించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని బండెల వెంకయ్య, గోకినపల్లి వెంకటేశ్వరరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు, నాయకులు రేపాకుల శివలింగం, వీర్ల వెంకట అప్పారావు, కూరాకుల నరసయ్య, సోమనపల్లి వెంకటేశ్వర్లు, కే. లోతు పాపారావు, కొల్లి నాగేశ్వరరావు, ఎస్.కే. జానీ, చల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.