నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు నడుస్తున్నాయనే ఆరోపణలు – చర్యలకు బీజేపీ నేత వినతి
కూసుమంచి, జూన్ 22(ఖమ్మం వాణి)
మండల కేంద్రంలో కొన్ని వైన్ షాపులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు, 8వ వార్డు సభ్యులు గుండా ఉపేందర్ రెడ్డి కోరారు. ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. నేలకొండపల్లి రోడ్డులోని ఒక వైన్ షాపును పూర్తిగా మూసివేసి వెనుక వైపు నుండి విక్రయాలు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. అదేవిధంగా కొన్ని షాపులు రాత్రి 9 గంటలకు ముందే షట్టర్లు మూసివేస్తున్నాయని, దీనిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అక్రమ మద్యం, కల్తీ మద్యం విక్రయాలను అరికట్టాలని, ఎక్సైజ్ శాఖ అధికారులు నిబంధనలు పాటించని షాపులపై తనిఖీలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామనే కారణంతో నిబంధనలు ఉల్లంఘిస్తే పేద కుటుంబాలు నష్టపోతాయి. అధికారులు ఈ విషయాన్ని మానవీయ కోణంలో పరిశీలించాలి” అని సూచించారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా ఎక్సైజ్ అధికారులకు, ఆపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ప్రజా క్షేత్రంలో ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. సమాజంలో మంచి పేరున్న ప్రజాప్రతినిధుల పేరును దుర్వినియోగం చేసే చర్యలను ఎవరూ సహించరని ఆయన అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని షాపులపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన ఎక్సైజ్ శాఖను కోరారు.
