భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి.
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి అన్నారు.
తిరుమలాయపాలెం, జూన్ 22(ఖమ్మం వాణి)
తిరుమలాయపాలెం పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని సూచించారు. తాము దూరంగా ఉండటమే కాకుండా, తోటి విద్యార్థులను, చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక, సామాజిక దుష్పరిణామాలపై విద్యార్థులతో పాటు ప్రజలకు కూడా విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలాయపాలెం సీఐ సంజీవ్, ఎస్సై జగదీశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
