భక్తి శ్రద్ధలతో బచ్చోడు తండాలో సీత్లా భవాని పండుగ వేడుకలు..
తిరుమలాయపాలెం, జూలై 07(ఖమ్మం వాణి): బచ్చోడు తండా బంజారా సమాజం ఆరాధ్య దైవం సీత్లా భవాని మాత పండుగను ఇక్కడ భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఉపవాసాలతో భక్తులు సీతులమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు రంగురంగుల లంగా ఓణీలు, వెండి నగలతో, పురుషులు సంప్రదాయ దుస్తులతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. భజనలు, గోర్ మాటలో పాటలతో వాతావరణం భక్తిమయంగా మారింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై సీత్లా భవాని మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బంజారా సంస్కృతి మన గుర్తింపు అని, సీతుల భవాని పండుగలు ఐక్యతకు, భక్తికి గుర్తు అని చెప్పారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని, యువత తమ సంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో లెంగా నృత్యాలు, గోర్ బంజారా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. గ్రామంలో సుభిక్షత, ఆనందం ఉండాలని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు రామా సహాయం అరవింద్ రెడ్డి హరిత రెడ్డి, మాజీ ఎంపిటిసి గుగ్గిళ్ళ అంబేద్కర్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు సైపుద్దీన్, గ్రామ సర్పంచ్ భూక్య కుమారి బాలు, వార్డు సభ్యులు గుగులోత్ సురేష్ నాయక్, రవి నాయక్, సైదా నాయక్, గ్రామ పెద్దలు కిషన్ నాయక్, దేవ్ సింగ్ నాయక్, లాలు నాయక్, దేవేందర్ నాయక్ తో పాటు పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
