కాకరవాయి మత్స్యకార సంఘంలో చేపల వేట వివాదం…
ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు…
మద్దుల చెరువులో చేపలు పట్టే అంశంలో గొడవ.. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న విభేదాలు…
తిరుమలాయపాలెం, జూలై 08(ఖమ్మం వాణి): మండల పరిధిలోని కాకరవాయి గ్రామంలోని మత్స్యకార సంఘంలో చేపల వేట అంశం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం ఉదయం మద్దుల చెరువులో చేపలు పట్టే విషయంలో సంఘానికి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరిగి అది కాస్తా చేతుల కలయికకు దారితీసి ఘర్షణగా మారింది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి తలకు, చేతులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రథమ చికిత్స అందించినట్లు సమాచారం.
• గత 3 ఏళ్లుగా వివాదం
గొడవకు కారణం మత్స్యకార సంఘంలోని అంతర్గత విభేదాలేనని ఇరు వర్గాలు పరస్పరం ఆరోపించుకున్నాయి. చెరువులో చేపలు పట్టే కాంట్రాక్టు, ఆదాయ పంపకాల విషయంలో గత మూడు సంవత్సరాలుగా రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ వివాదాల కారణంగా కాకరవాయి చెరువుల్లో చేపల వేట సక్రమంగా సాగడం లేదని, దీనివల్ల సంఘ సభ్యుల జీవనోపాధి దెబ్బతింటోందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘంలో శాంతి నెలకొల్పేందుకు పలుమార్లు రాజీ ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయిందని, అప్పుడప్పుడు ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు తెలిపారు.
• పోలీసులకు ఫిర్యాదు
ఘటన అనంతరం ఇరు వర్గాలు తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఒకరిపై ఒకరు దాడి చేసినట్లు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల మేరకు తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.
