బచ్చోడు వద్ద రోడ్డు ప్రమాదం – గైగోలపల్లి బైక్ మెకానిక్ కుమ్మరికుంట్ల పుల్లయ్య మృతి!
ఖమ్మం, జూన్ 22 (ఖమ్మం వాణి):
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గైగోలపల్లి గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ కుమ్మరికుంట్ల పుల్లయ్య (45) ఆదివారం తెల్లవారుజామున ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూన్ 19 శుక్రవారం రోజున పుల్లయ్య బైక్ సంబంధిత సామాగ్రి కొనుగోలు కోసం మరిపెడ బంగ్లా వెళ్లి తిరిగి వస్తుండగా బచ్చోడు శివారులో ఈ ప్రమాదం జరిగింది. అదే రోజు పాలేరు సంతకు పశువులను తరలిస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఆయన ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య తలకు, తొడకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడికి ప్రాథమిక సహాయం అందించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, పుల్లయ్యను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత కారణంగా పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుల్లయ్య మృతితో గైగోలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన రోజు కొంతసేపు రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, స్థానికులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
