ఖమ్మం/తిరుమలాయపాలెం: జూన్ 17(ఖమ్మం వాణి)తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ఓ రిటైర్డ్ మాజీ వీఆర్ఓ ప్రయత్నిస్తున్నాడని గిరిజన రైతు ఆరోపించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తానని బాధితుడు స్పష్టం చేశారు. ఇస్లావత్ తండాకు చెందిన గిరిజన రైతు ఇస్లావత్ ధుబ్ల తెలిపిన వివరాల ప్రకారం, మహ్మదాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 105/ఊ ఎకరం, 105/ఎ లో 10 గుంటల భూమి తమ తాత ఇస్లావత్ వస్రం కాలం నుంచి అనుభవంలో ఉంది. సుమారు 60 ఏళ్ల క్రితం క్రైస్తవ మత బోధకుడైన అప్పటి సీఎస్ఐ పాస్టర్ చైర్మన్ లాజరస్ లాల్ సింగ్, డోర్నకల్ బిషప్ పట్టా పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తమ తాత సాగులోకి తెచ్చారని, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి తనకు వారసత్వంగా సంక్రమించిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు.అయితే స్థానిక మాజీ వీఆర్ఓ తమ సాగు భూమిపై కన్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు చెందిన సర్వే నంబర్లు తమ భూమిలో ఉన్నాయని చెబుతూ, దౌర్జన్యంగా రాతి స్తంభాలతో ఫెన్సింగ్ వేయిస్తున్నారని, పోలీసు అధికారులు, స్థానికేతర రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.“ప్రభుత్వ ఉద్యోగి అయిన మాజీ వీఆర్ఓకు గిరిజనుడి భూమిపై ప్రమేయం ఏమిటి? రెవెన్యూ రికార్డులు, వారసత్వ హక్కుల ప్రకారం ఆ భూమి మాదే. దౌర్జన్యంగా లాక్కునే హక్కు ఎవరికీ లేదు” అని బాధిత రైతు ప్రశ్నించారు.తన భూమిని కాపాడుకునేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరంగా పోరాడతానని, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇస్లావత్ ధుబ్ల స్పష్టం చేశారు. చట్టపరమైన అంశాలు:గిరిజన భూముల బదిలీ నిషేధ చట్టం 1/70 ప్రకారం గిరిజనేతరులు గిరిజనుల భూములను ఆక్రమించడం, కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. అలాగే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం గిరిజనులను బెదిరించడం, భూమి ఆక్రమణకు యత్నించడం శిక్షార్హమైన నేరం.
