హస్నాబాద్లో శ్రీరామాలయ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు..
జూలై 7 నుంచి 9 వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహణ
ఖమ్మం/తిరుమలాయపాలెం:జూన్ 30(ఖమ్మం వాణి) ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హస్నాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ప్రారంభోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం వేదోక్తంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ మహోత్సవంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, హోమాలు, యాగాలు, కలశస్థాపన, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ధ్వజస్తంభ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడనుండగా, భక్తుల గోవింద నామస్మరణలు, శ్రీరామ నామ సంకీర్తనలతో హస్నాబాద్ గ్రామం భక్తిమయ వాతావరణంలో మునిగిపోనుంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు నూతన ఆలయం వద్ద సమావేశమై మహోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ప్రసాదాల పంపిణీ, వాహనాల పార్కింగ్, కూర్చునే ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. శ్రీరాముని ఆలయ ప్రతిష్ట వంటి పుణ్యకార్యాల్లో పాల్గొనడం ద్వారా దైవానుగ్రహం, కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు పేర్కొంటున్నారు. అందుకే సమీప గ్రామాల ప్రజలతో పాటు జిల్లాలోని భక్తులు కూడా ఈ మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనం చేసుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి అనుగ్రహంతో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరిగి గ్రామానికి సుఖశాంతులు, సస్యశ్యామలత, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.
