హామీల అమలు చేతకాక ఎమ్మెల్సీ తాత మధుపై కాంగ్రెస్ నేతల వ్యక్తిగత దాడులు…
బీఆర్ఎస్ మండల నేత కొప్పుల ఉపేందర్ రెడ్డి ఆగ్రహం!
ఖమ్మం,జూన్ 30(ఖమ్మం వాణి): ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై పనిగట్టుకుని వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బీఆర్ఎస్ తిరుమలాయపాలెం మండల నాయకుడు కొప్పుల ఉపేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపేందర్ రెడ్డి మాట్లాడారు. శాసనమండలి సభ్యుడి హోదాలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం తాత మధు బాధ్యత అని, అలా ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు అచ్చొచ్చిన ఆంబోతుల్లా ఆయనపై విరుచుకుపడటం దిగజారుడు రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే కళంకం అని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. “అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా చెప్పుకోదగ్గ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రైతు భరోసా పథకాన్ని *మూడు పంటలకు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టి* రైతుల కడుపుకొట్టారు. ఎకరాకు రూ.15,000 ఇస్తామని మోసం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు నెలకు రూ.4,000 పెన్షన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కళాశాల విద్యార్థినులు ఉచిత స్కూటీల కోసం, మహిళలు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రూ.5 లక్షల విద్యార్థుల భరోసా కార్డు హామీలు ఏమయ్యాయి?” అని నిలదీశారు. “ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన 420 హామీలను ముందు అమలు చేసి చూపించాలి. దమ్ముంటే మా ఎమ్మెల్సీ తాత మధుతో పథకాల అమలుపై బహిరంగ చర్చకు రావాలి. అది చేతగాక సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడైన తాత మధుపై వ్యక్తిగత దాడులకు దిగడం కాంగ్రెస్ దివాళాకోరుతనం” అని విమర్శించారు. “కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలు మానుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం పాలన సాగించాలి. ఇదే వైఖరి కొనసాగితే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే కార్యకర్తల తడాఖా ఏంటో రుచి చూపిస్తారు” అని కొప్పుల ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు.
