వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలు: పాలేరు బీఆర్ఎస్ శ్రేణులు
ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ అధిష్ఠానం, జిల్లా నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల మాజీ అధ్యక్షులు, ముఖ్య నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా రైతు సమస్యలు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ జిల్లా ఎమ్మెల్సీ తాత మధు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
⇒ కాంగ్రెస్ హయాంలో దళారీ వసూళ్లు: బెల్లం వేణుగోపాల్
ఖమ్మం రూరల్ మాజీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ మాట్లాడుతూ, “మొక్కజొన్న, వరి కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమైంది. బీఆర్ఎస్ హయాంలో షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. నేడు కేంద్రాలు ఏర్పాటు చేయడం, గోనె సంచులు ఇవ్వడం చేతకాని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరం. గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాల వద్ద లారీ డ్రైవర్ల నుంచి బస్తాకు 15 నుంచి 20 రూపాయలు వసూలు చేసిన దళారీ చరిత్ర కాంగ్రెస్‌ది. పాలేరు రైతాంగాన్ని అడిగితే బస్తాకు 60 రూపాయలు, ఒక్కో లారీ లోడ్‌కు 50,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసిన విషయం తెలుస్తుంది” అని ఆరోపించారు.”రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారిన కాంగ్రెస్ నేతలు, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి కేసీఆర్ విధానాలు నచ్చి పార్టీలో చేరిన తాత మధు గురించి మాట్లాడటం తగదు. పొంగులేటి రాఘవరెడ్డి ఆస్తులు, కాంగ్రెస్ నేతల భూకబ్జాలకు పిండిప్రోలు గ్రామ ప్రజలే సాక్ష్యం” అని పేర్కొన్నారు.”పాలేరులో కరువు పారదోలి, మున్నేరుపై చెక్ డ్యాములు, తిరుమలాయపాలెం నుంచి మొలకలపల్లి కోట వరకు వంతెనలు నిర్మించిన ఘనత కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ది. దమ్ముంటే మంత్రి, కాంగ్రెస్ నేతలు ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. 2027-28 వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఉపేందర్ రెడ్డిపై పోటీ చేసి గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే మేము పదవులకు దూరంగా ఉంటాం. లేదంటే పాలేరు ప్రజల సత్తా చూపిస్తాం” అని సవాల్ విసిరారు.
⇒ మహిళలను కించపరిస్తే సహించేది లేదు: భాషబోయిన వీరన్న
తిరుమలాయపాలెం మాజీ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి సభకు సంబంధించి ఎమ్మెల్సీ తాత మధు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. దౌర్జన్యాలు, భూ సెటిల్మెంట్లు, మైనింగ్ అక్రమ కేసులు, సొంత కుమారుడిపై వాచీల దొంగతనం కేసులు ఉన్న కాంగ్రెస్ నేతలు అవినీతి రహితంగా పనిచేసిన తాత మధుపై మాట్లాడటం హాస్యాస్పదం. డబ్బు కోసం కండువాలు మార్చిన నేతలు నేడు అధికార అహంకారంతో మాట్లాడుతున్నారు” అని విమర్శించారు. “బీఆర్ఎస్ మహిళా నేతలు, తిరుమలాయపాలెం ఆడబిడ్డలను కించపరిచేలా మాట్లాడితే మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుంది” అని హెచ్చరించారు.
⇒ పొంగులేటి లూటీలను సొంత నేతలే ఎండగట్టారు: ఉన్నం బ్రహ్మయ్య
నేలకొండపల్లి మాజీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య మాట్లాడుతూ, “తాత మధు చేసిన ఆరోపణలు కొత్తవి కావు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కొండా సురేఖ పొంగులేటి భూకబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు, సమ్మక్క సారలమ్మ కాంట్రాక్టుల కమీషన్లను ఎండగట్టారు. దమ్ముంటే ఈ జిల్లాలో బీఆర్ఎస్ నాయకత్వంతో ముఖాముఖి చర్చకు రావాలి. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేక, ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకనే ఇలాంటి ప్రేలాపనలు చేస్తోంది” అని అన్నారు.
⇒ పాలేరుకు కాంగ్రెస్ చేసింది శూన్యం: వేముల వీరయ్య
కూసుమంచి మాజీ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య మాట్లాడుతూ, “కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలేరులో అభివృద్ధి జరిగింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా కాంగ్రెస్ సాధించింది శూన్యం. కేసీఆర్ షరతులు లేకుండా ప్రతి ఎకరాకు రైతుబంధు ఇస్తే, కాంగ్రెస్ షరతుల పేరుతో దాన్ని ఎగ్గొట్టే కుట్ర చేస్తోంది. ఇప్పటికే మూడు విడతల రైతు భరోసాను ఎగ్గొట్టింది” అని దుయ్యబట్టారు.
⇒ వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు: కొప్పుల ఉపేందర్ రెడ్డి
తిరుమలాయపాలెం మండల నాయకుడు కొప్పుల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, “అధికార పక్షం మండల నాయకులతో వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు చేయించడం సరికాదు. యూట్యూబ్‌లో ‘పొంగులేటి’ అని వెతికితే లూటీల చరిత్ర బయటపడుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు, మహిళలు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. వృద్ధులకు ఆసరా పెన్షన్లు లేవు, మహిళలకు స్కూటీలు లేవు. వీటిపై సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత దూషణలకు దిగితే బీఆర్ఎస్ యువత చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ నేతలు వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ వర ప్రసాద్, నాయకులు మరికంటి రేణుబాబు, చావా వేణుగోపాల్, మళ్లీదు వెంకన్న, మంచా నాయక్, ఉదయ్ శంకర్ రాజు, గుండెబోయిన దర్గయ్య, మహబూబ్ అలీ, వెంపటి కృష్ణారావు, మట్టా వేంకటేశ్వరరావు, మొర్రిమేకల నాగేశ్వరరావు, జర్పుల లక్ష్మణ్, నారపాటి రమేష్, దోమల రవి, రెడ్య నాయక్, బానోత్ వీరన్న, కోటా సైదారెడ్డి, మేదరమెట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం వాణి డెస్క్
