గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో నిరుపేద ఇంటి పైకప్పు ఎగిరిపోయి కుటుంబం రోడ్డుపాలు..
తిరుమలాయపాలెం, జూన్ 22 (ఖమ్మం వాణి): మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామంలో సోమవారం అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టం కలిగించింది. గాలుల తీవ్రతకు గ్రామానికి చెందిన గుండమ్మల నరేష్ అనే నిరుపేద ఇంటి పైకప్పు పూర్తిగా ఎగిరిపోయి దూరంగా పడిపోయింది.
నిలువ నీడ కోల్పోయిన కుటుంబం
గుండమ్మల నరేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబానికి ఉన్న ఏకైక ఆసరా ఈ ఇల్లే. ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో లోపల ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, పిల్లల పుస్తకాలు అన్నీ వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. అకస్మాత్తుగా నిలువ నీడ కోల్పోవడంతో నరేష్ తన కుటుంబంతో రోడ్డున పడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ సాయం కోసం వేడుకోలు
“రెక్కాడితే కానీ డొక్కాడని మాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది. సర్వం కోల్పోయి వీధిన పడ్డాం” అని బాధితుడు నరేష్ కన్నీటి పర్యంతమయ్యాడు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం, మండల అధికారులు తక్షణమే ఆదుకోవాలని, నివాస యోగ్యంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని ఆయన వేడుకుంటున్నారు. బాధిత కుటుంబానికి అత్యవసర సహాయం అందించాలని గ్రామస్తులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
