సుబ్లేడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును రోజుకు నాలుగుసార్లు పునరుద్ధరించాలి.
తిరుమలాయపాలెం, జూన్ 22 (ఖమ్మం వాణి): సుబ్లేడు గ్రామానికి గతంలో రోజుకు ఐదుసార్లు ఆర్టీసీ బస్సు సర్వీసు ఉండేదని, ప్రస్తుతం ఆ సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలాయపాలెం మండలంలో సుబ్లేడు మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ పాఠశాలలు, ఆసుపత్రి, పోస్టాఫీసు, పశువైద్యశాల ఉన్నాయి. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగులు విధులకు, విద్యార్థులు పాఠశాలలకు సకాలంలో వెళ్లలేకపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఆరోగ్య, విద్య, ఉద్యోగ అవసరాలకు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ఈ సమస్య పరిష్కారానికి సుబ్లేడు మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. సుబ్లేడు గ్రామానికి రోజుకు కనీసం నాలుగుసార్లు ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్లేడు మాజీ సర్పంచి భూక్య వీరన్న, సీఐటీయూ మండల కార్యదర్శి వసుపంగు వీరన్న తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం స్వీకరించిన డిపో మేనేజర్ స్పందిస్తూ, త్వరలోనే బస్సు సర్వీసును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.
