రైతు బచ్చలకూరి రాములకు ఐక్యవేదిక ఆధ్వర్యంలో సత్కారం.
తిరుమలాయపాలెం, జులై 01(ఖమ్మం వాణి) తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నిరుపేద రైతు బచ్చలకూరి రాములకు ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మందడి ఇజ్రాయిల్ శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి పేదరికంతో పోరాడుతూ వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబాన్ని నడిపిస్తున్న రాములు గ్రామంలో ఆదర్శ రైతుగా నిలిచారన్నారు. డబ్బు కంటే కష్టం విలువైనదని, రైతుల శ్రమపైనే సమాజం ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యం కోల్పోకుండా బాధ్యతలు నిర్వహిస్తున్న రాములు లాంటి వారు నేటి తరానికి స్ఫూర్తి అని తెలిపారు. శ్రమజీవులైన రైతులకు సమాజంలో తగిన గౌరవం దక్కాలని, వారిని ప్రోత్సహించడం అందరి కర్తవ్యమని ఇజ్రాయిల్ పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి రైతులను గుర్తించి అండగా నిలవాలని కోరారు. సన్మానం స్వీకరించిన బచ్చలకూరి రాములు స్పందిస్తూ, తనలాంటి సామాన్యుడిని సన్మానించడం సంతోషంగా ఉందని, ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. వ్యవసాయంలో కష్టాలు సహజమైనా నమ్మకంతో పనిచేస్తే గౌరవం తప్పకుండా లభిస్తుందని యువతకు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మాజీ సర్పంచ్ వల్లోజు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ మందుల వెంకన్న, వల్లపు కోటయ్య, ఏలూరు సత్యనారాయణ, మందుల ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.
