కన్నీటి ముద్ద.
తల్లి చేతి వంట తింటుండగానే తుదిశ్వాస విడిచిన ఆటో డ్రైవర్
తిరుమలాయపాలెం, జూన్ 23 (ఖమ్మం వాణి): ఓ తల్లి ప్రేమతో వడ్డించిన అన్నం ముద్ద నోట్లో ఉండగానే, ఆ కొడుకు కన్నుమూశాడు. ఈ హృదయ విదారక ఘటన తిరుమలాయపాలెం మండలాన్ని కలచివేసింది. కొక్కిరేణి గ్రామానికి చెందిన జంగం రామకృష్ణ (37) ఖమ్మంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి బాడుగలు తిరిగి, అలసిన దేహంతో ఇంటికి చేరాడు. ఇంట్లో తల్లి భారతమ్మ కొడుకు ఆకలి తీర్చాలని ఆప్యాయంగా అన్నం వడ్డించింది. అమ్మ చేతి ముద్దను నోట్లో పెట్టుకుంటున్న ఆ క్షణంలోనే విధి వక్రించింది. ఉన్నట్లుండి రక్తపోటు పెరిగి, పక్షవాతం సోకడంతో రామకృష్ణ కుప్పకూలిపోయాడు.
⇒ ఆఖరి ప్రయాణం
వెంటనే కుటుంబసభ్యులు హుటాహుటిన ఆటోలోనే తిరుమలాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. కానీ, వైద్యులు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూనే రామకృష్ణ కన్నుమూశాడు.”అన్నం ముద్ద నోట్లో ఉండగానే పక్షవాతం రావడంతో, ఆ ముద్ద ఊపిరితిత్తుల్లోకి జారి ఊపిరాడక మృతి చెందాడు” అని వైద్యులు తెలిపారు. రామకృష్ణ అకాల మరణంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. తాను వడ్డించిన చివరి ముద్దే కొడుకు ప్రాణం తీసిందని తల్లి భారతమ్మ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆటో డ్రైవర్గా అందరినీ చేరవేసిన రామకృష్ణ, చివరికి తానే అంతిమ యాత్రకు బయలుదేరడంతో కొక్కిరేణి గ్రామం శోకసంద్రంలో మునిగింది.
