తిరుమలాయపాలెం మండలంలో 8 రైతు వేదికల్లో ‘విత్తన మేళా’
తిరుమలాయపాలెం, జూన్ 23 (ఖమ్మం వాణి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని 8 రైతు వేదికల్లో మంగళవారం ‘విత్తన మేళా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ మిట్టపల్లి సతీష్, మండల వ్యవసాయ అధికారి శ్రీ నారెడ్ల సీతారామిరెడ్డి, సొసైటీ ఉద్యోగులు, డీలర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
సన్న వడ్ల రకాలపై అవగాహన
ఈ సందర్భంగా ఏడీఏ మిట్టపల్లి సతీష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ప్రకటించిన నేపథ్యంలో రైతులకు లబ్ధి చేకూర్చే వరి వంగడాలపై సవివరంగా వివరించారు. బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్-44, డబ్ల్యూజీఎల్-962 వంటి సన్న వడ్ల రకాల సాగు, దిగుబడి, ప్రత్యేకతలను రైతులకు తెలియజేశారు.
నానో ఎరువుల వాడకంపై సూచనలు
ఎంఏఓ సీతారామిరెడ్డి మాట్లాడుతూ, రైతులు కేవలం యూరియాపైనే ఆధారపడకుండా నానో యూరియా, నానో డీఏపీలను పిచికారీ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే, రైతు వేదికల్లో వివిధ రకాల విత్తనాలను సొసైటీలు, డీలర్ల ద్వారా ప్రదర్శించి, రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే తమ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని కోరారు.
